నాయకత్వం లేని పాలన...ప్రజాస్వామ్యానికి అవమానం!
ఎన్నికలు లేవు... పాలన లేదు....సమస్యల సంద్రంలో గ్రామాలు!
గ్రామ పాలన కోసం ప్రజల పోరు... ఎన్నికలు కావాలంటూ గ్రామస్తుల గళం!
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల గడువు ముగిసి 14 నెలలు దాటినా, ఇప్పటివరకు ఎన్నికలపై ప్రభుత్వం నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌లు లేని గ్రామాలు అభివృద్ధిలో ముందడుగు వేయలేక, సమస్యలతో కేకలు వేస్తున్నాయి. ప్రజాప్రతినిధులే లేనిదే గ్రామ పాలన అస్తవ్యస్తమైపోయింది.ప్రధాన రహదారులు గుంతలతో నిండిపోయాయి. పాఠశాలల మరమ్మతులు ఆగిపోయాయి. మిషన్ భగీరథ, డ్రైనేజీ పనులు, నీటి సరఫరా నత్త నడకగానడుస్తున్నాయి. గ్రామానికి నాయకత్వం లేకపోవడమే ప్రధాన కారణంగా గ్రామస్థులు చెబుతున్నారు.గ్రామీణ భారత్ మిషన్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వంటి పథకాలు కాగితాల మీదే పరిమితమవుతున్నాయి. సర్పంచ్ లేని పాలన వల్ల పర్యవేక్షణ లేని పనులు నత్తనడకన సాగుతున్నాయి. మండల అధికారులు తీసుకునే నిర్ణయాలు పౌరులతో సమన్వయం లేకుండా అమలవుతున్నాయి. గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భావిస్తున్న యువత హక్కుల కోసం ఎదురు చూస్తోంది.సర్పంచ్ ఉన్నప్పుడు అభివృద్ధి కనిపించేది. ఇప్పుడు సమస్యలు వినేవాళ్లు లేరు అని గ్రామస్థులు వాపోతున్నారు. పాలన లేకుండా గ్రామ అభివృద్ధి అసాధ్యమని పటిష్టంగా చెబుతున్నారు.
ఎన్నికల ప్రకటన జారీ చేయాలని డిమాండ్
ప్రజలు, యువత, ప్రజా సంఘాలు స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.గ్రామాల అభివృద్ధి ఎన్నికల ద్వారానే సాధ్యం అని స్పష్టం చేస్తున్నారు.