ప్రభావిత ప్రాంతాల్లో సమగ్ర పర్యవేక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. పకృతి వైపరీత్యాలతో వర్షం తెగపడుతోంది. అకాలంగా కురుస్తున్న ఈ అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా రైతన్న మళ్లీ ఆందోళనలో కూరుకుపోతున్నారు. కష్టపడి పండించిన పంటలు చేతికి రాకముందే నీట మునిగిపోతున్నాయి.మధ్యంతర వర్షాలకు విత్తనాలు నాశనమయ్యాయి. పంట నిండుగా ఉన్నా, కోతకు ముందే తడిసిపోవడంతో నాణ్యత తగ్గింది. కొన్ని చోట్ల రైతులు కోతకు దిగలేకపోతే, మరికొన్ని ప్రాంతాల్లో కోత అనంతరం వర్షంతో నష్టం ఎదురవుతోంది. ఓ వైపు గాలివానకు మామిడి తోటలు, బొప్పాయి తోటలు , పండ్ల తోటలకు అపార నష్టం కలిగించింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ మోడ్‌లోకి వెళ్లాలి.పంట నష్టాన్ని గ్రామ స్థాయిలో నమోదు చేసి, రికార్డులకు బలంగా నిలబెట్టాలి, నష్టపరిహారం రైతు ఖాతాల్లోకి వేగంగా జమ చేయాలి.కౌలు రైతులకు కూడా నష్ట పరిహారం అందేలా ప్రత్యేక గైడ్‌లైన్లు రూపొందించాలి. వానల తీవ్రతను అంచనా వేసి, ప్రతి జిల్లాలో ప్రత్యేక నిగా పెట్టాలి. జిల్లాల వారీగా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నష్ట నివేదికలు సిద్ధం చేయాలని రాజకీయ విశ్లేషకులు , నిపుణులు భావిస్తున్నారు.*ప్రభుత్వం ఏమి చేస్తోంది?*ఇప్పటికే నష్టపోయిన రైతులకు ఎలా భరోసా ఇస్తుంది.? ఏ చర్యలు చేపట్టింది..? గ్రామస్థాయిలో పంటలను పరిశీలించి తక్షణమే నివేదికలు కేంద్రానికి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయా...? లేదా కేవలం నివేదికలకే పరిమితమవుతున్నాయా..? అనే పలు అనుమానాలు రైతాంగానికి ప్రజలకు రేకితిస్తున్నాయి. ప్రభుత్వం ధైర్యం చెప్పాలి... మాటల్లో కాదు, చర్యల్లో..! నష్టపరిహారం ప్రక్రియ స్పష్టంగా ఉండాలి. ఎవరికి ఎంత నష్టం? ఎంత పరిహారం? ఎప్పుడు వస్తుంది? అన్నదానిపై స్పష్టత ఉండాలి. జిల్లాల వారీగా హెల్ప్‌లైన్లు, రైతు సేవా కేంద్రాల ద్వారా సమాచారం అందేలా చూడాలి.రైతన్న ఎదురుచూస్తున్నది సహానుభూతి కాదు.స్పష్టమైన భరోసా. ఆ భరోసా మాటల్లో కాకుండా చర్యల్లో కనిపించాలి. ప్రభుత్వ యంత్రాంగం ఎంత త్వరగా స్పందిస్తే... రైతు అంత త్వరగా తిరిగి నిలబడతాడు.ప్రతి క్షణం విలువైనది. ప్రకృతి ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. కానీ పాలకుల సమయ స్పందన, ప్రజల పట్ల బాధ్యత మిగిలిపోయే మార్గం. ఇప్పుడు స్పందించకపోతే… నష్టం పెరిగేది ప్రజలకు మాత్రమే కాదు, పరిపాలనపైనా ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రభుత్వ తక్షణ స్పందనే ప్రజలకు భరోసాగా నిలిచేలా ఉండాలన్నారు.